వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు

  • డిప్యూటీ సీఎం పవన్‌పై గొడ్డలి పార్టీ పనిగట్టుకుని కుట్రలు చేస్తోందని సీఎం ఆరోపణ
  • పవన్‌పై నోరెత్తితే మూయించే శక్తి తమకుందని చంద్రబాబు తీవ్ర హెచ్చరిక
  • ప్రతి ఘటనకూ కులం రంగు పులిమి విషం చిమ్ముతున్నారని విమర్శ
  • తిరుమల లడ్డూ ప్రసాదంపై గత ప్రభుత్వంలో ఘాతుకాలు జరిగాయన్న సీఎం
  • గొడ్డలి పార్టీ నేత కుట్రలు బయటపడ్డాయని, ఇప్పుడు దండాలు పెట్టినా లాభం లేదన్న చంద్రబాబు
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని 'గొడ్డలి పార్టీ' పనిగట్టుకుని కుట్రలు పన్నుతోందని, ఆయనపై అనవసరంగా నోరు పారేసుకుంటే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం కర్నూలు జిల్లా జొన్నగిరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై గొడ్డలి పార్టీ లేనిపోని దుష్ప్రచారం చేస్తోంది. పవన్‌ను టార్గెట్ చేసుకుని కుట్రలు పన్నుతున్నారు. ఆయనపై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. మళ్లీ నోరెత్తకుండా ఇలాంటి వాళ్ల నోరు మూయించే శక్తి మాకుంది" అని హెచ్చరించారు. 

విజయవాడ సాయికృష్ణ అదృశ్యం వంటి ఘటనలకు కులాన్ని ఆపాదిస్తూ విషం చిమ్ముతున్నారని, కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో గొడ్డలి పార్టీ నాయకుడు దిట్ట అని విమర్శించారు. ప్రతి ఘటనకూ కులం రంగు పూసి రెచ్చగొట్టడం, తప్పులు చేసి ప్రజలను మభ్యపెట్టడం వారికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో గత ప్రభుత్వ పాలకమండలి ఘాతుకాలకు పాల్పడిందని చంద్రబాబు ఆరోపించారు. "తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసేలా కల్తీ నెయ్యిని గత ప్రభుత్వంలోని పాలకమండలి వాడింది. లడ్డూ ప్రసాదం విషయంలో గొడ్డలి పార్టీ పాలనలో చేసిన ఘాతుకాలు ఇప్పుడు బయటపడ్డాయి" అని తెలిపారు. 

ఆ కుట్రలన్నీ బయటపడటంతోనే ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు గొడ్డలి పార్టీ నాయకుడు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాడని, ఎన్ని దండాలు పెట్టినా ఇక లాభం లేదని ఎద్దేవా చేశారు. "గొడ్డలి పార్టీ నాయకుడు ఆచరించే మతాన్ని మేమంతా గౌరవిస్తున్నాం. కానీ వాళ్లు దేవాలయాల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చూస్తూ ఊరుకోం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లకు గొడ్డలి పార్టీ అండ!

రాజకీయ ముసుగులో గొడ్డలి పార్టీ (ప్రతిపక్ష పార్టీ) గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లకు అండగా నిలుస్తోందని, యువతను చెడు మార్గం పట్టించి బలి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. జొన్నగిరిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ... గొడ్డలి పార్టీకి విధ్వంసమే విజన్ అని, ఫేక్ ప్రచారమే వారి విధానమని, రప్పా రప్పా రాజకీయాలే మేనిఫెస్టో అని ధ్వజమెత్తారు.

"బాబాయి మర్డర్ నుంచి మొన్నటి పాస్టర్ రోడ్డు ప్రమాదం వరకు వాళ్లు కుట్రలనే నమ్ముకున్నారు. పోస్టర్లకు జంతు బలులు ఇవ్వటం వారి నైజం. గొడ్డలి పార్టీకి భవిష్యత్తు లేదు" అని చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకులు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా, ఇప్పుడు డీఎస్సీపై బురద చల్లుతున్నారని ఆయన ఆరోపించారు.

తాము హామీ ఇవ్వనప్పటికీ 10,800 మంది ఉద్యోగులను సీపీఎస్ నుంచి పాత పెన్షన్ స్కీమ్‌లోకి తీసుకొచ్చామని, దీనివల్ల ఒక్కో ఉద్యోగికి రూ.3 కోట్ల వరకు ప్రయోజనం కలుగుతుందని సీఎం వివరించారు. రాయలసీమకు ఏం చేశారో గొడ్డలి పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "సీమకు నీళ్లిచ్చే విషయంలో వారికి చిత్తశుద్ధి లేదు. కనీసం ప్రాజెక్టు గేట్లు కూడా మరమ్మత్తులు చేయించలేదు. మేం కర్ణాటకతో కలిసి తుంగభద్రకు కొత్త గేట్లు ఏర్పాటు చేశాం" అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగిందని, వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను వెల్లడిస్తూ ఇకపై ప్రోగ్రెస్ రిపోర్టులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Chandrababu Naidu
Pawan Kalyan
Andhra Pradesh Politics
Jonnagiri Kurnool Meeting
Tirumala Laddu Controversy
YSRCP

More Telugu News